సంస్కృతాన్ని దైవీవాక్ అంటారు. అంటే దేవతలు మాట్లాదేదని కాదు, మనం ఆమెను పలికితే దేవతలలా అయిపోతామని అర్థం. అటువంటిది ఆ భాషలో దేవత గురించిన కావ్యాలింకా ఎంత మధురాలో, ఎంత దివ్యాలో మాటలలో చెప్పగలగే నాథుడు లేడు. అవి అనుభవించి తీరవలసినవి. పరతత్త్వాన్ని ఏ కొందరో అదృష్టవంతులు, తపస్వులు, ప్రయత్నశీలురైన ధీరులు ఆవిష్కరించుకోగలిగారు.
వారు మిగితా సామాన్య విశేష సాధకుల కోసం ఆ తత్త్వాన్ని శాస్త్రాలుగా, కావ్యాలుగా, తంత్రాలుగా, ఆగమాలుగా, విశేషపద్ధతులలో ఎన్నో విధాలుగా ప్రకటించారు. సౌలభ్యం కోసం మరి కొందరు మహాత్ములు వాటికి వ్యాఖ్యలు, అనువాదాలు, వివరణలు వ్రాసి మనకు మరింత చేరువ చేశారు. వాటిని సామాన్యంగా చదివినా, విశేషంగా అధ్యయనం దృష్టితో పఠించినా, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా, లేదా సత్కాలక్షేపం అనుకుని ఆ అక్షరాలపై కళ్ళాడిస్తూ సమయం గడిపినా ఎంతో కొంత పుణ్యలాభం, అంతర్దృష్టిలో వికాసం, లోపలి ప్రపంచంలో మంచి మార్పు, దివ్యదిశగా ఏదో ఒక కదలిక అనుభూతి కావటం వారి వారి స్థాయిని బట్టి అనుభవించినవారికి ఎరుక. అప్పుడు కలిగే దివ్యానందం అనుభవైకవేద్యం. ఏమీ అంటకపోయినా కొద్ది దురితాల ప్రక్షాలనం కోసమైనా వీటి పఠనం లాభం చేకూరుస్తుంది.
ప్రాచీన భారతీయ సనాతన సత్పథంలో ఇట్టి ప్రయత్నాలెన్నో జరిగాయి. వాటిలో పరతత్వాన్ని దేవీరూపంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం ఒకటి ఈ ఉమాసహస్రం. ఇది పరిచయం తో పని లేని మహాత్ములు శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారి రచన. దీనికి పన్నాల రాధాకృష్ణ శర్మ గారు వ్యాఖ్య వ్రాసి మనకెంతో ఉపకారం చేశారు. ఎంతో దయతో రమణాశ్రమం వారు మనకోసం ప్రచురించారు.
https://www.eganesha.in/product/uma-sahasram-telugu/
Type:
Paperback
SKU:
RAM T 008
Publication
Year: 2013 3rd Edition
Author:
Pannala Radhakrishna Sharma
ISBN:
9788182880511
ఇక ఆ పుస్తకాన్ని తమ కుమారుడు ఉపహారంగా ఇస్తే అది చూసి, లేదా తన స్వలాభం కోసం చదివి ఊరుకోకుండా దాన్ని మనకు టంకిత రూపంలో అందించినవారు సహృదయురాలు మాన్య శ్రీమతి శివకామసుందరిగారు. మా సంస్కృతసంస్కృతీ (వాట్సాప్) సదస్సులో ఆమె ఈ టంకణం పనిని ఒక సాధనలో భాగంగా, నిరంతరం చేస్తూన్నారు. మరొకరికి లాభం కలిగిందా లేదా అని కాకుండా తనలో వచ్చే ఒక సన్మార్పు కోసం ఓ దివ్యోద్యమంగా ఈ పనిని చేస్తున్న ఈ తపస్వినికి నమస్సులు. ఎట్లైనా మల్లెలు పంచితే ఆ సుగంధం మన చేతికి అందకుండా ఉంటుందా? మనకందిస్తూ ఆమెకు, ఆమె చేత అందుకుంటూ మనకూ కూడా లాభమే కదా.
వారి శ్రమ వృథా పోకుండా ఈ కృతిని పంపినది పంపినట్టు భద్రపరిచి బ్లాగు చేద్దామని నిర్ణయించింది ఇంకా ఎందరో తెలుగువారికి నెట్ ద్వారా ఉపకారం జరగాలని. దీనిని సామాన్యంగా చదివేవారికి ఏ విధానాలతో పని లేదు. సంస్కృతార్థులకోసం మాత్రం కొన్ని సూచనలు ఈ క్రింద ఇవ్వటమైనది-
సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం-
సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం-
1. మొదలు మూల శ్లోకం, తరువాత అదే క్రమంలో మిగిలినదంతా – పదవిభాగాదులను చదవటం.
2. పూర్తి అయినాక మళ్ళీ విరుద్ధ దిశగా కిందనుండి పైకి
చదివటం. అంటే తెలుగు అనువాదం, ప్రతిపదార్థం, అన్వయం – అట్లా.
3. తరువాత అనువాదంలోని ఫలానా తెలుగు పదం మూలంలో
ఎక్కడున్నది- అని ఊహిస్తూ మూలంలోనైనా పదవిభాగంలోనైనా చూసుకోవటం.
4. సంస్కృతవాక్యం అన్వయక్రమం ప్రకారం తెలుగు
అనువాదాన్ని సరిపోల్చుకోవటం. అది ఒకసారి ఇది ఒకసారి చదవటం.
5. సంధులను పదవిభాగంలోనే శ్లోకాధ్యయనం చివరలో సంధుల
దృష్టితో మరోసారి చదవటం మంచిది. (పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, ఈ స్థాయిలో పదాన్ని విడదీసే విధానం తెలిస్తే చాలు)
6. సమాసాలను ప్రతిపదార్థంలో చదివి సద్వినియోగం
చేసుకోవటం మంచిది. (ఈ స్థాయిలో సమాసాల పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, విగ్రహం రాకపోయినా విడదీసే విధానం తెలిస్తే చాలు అని భావం.)
7. ఏవైనా ప్రయోగవిశేషాలు గమనించటం- ‘ఓహో, ఈ భావాన్ని
వ్యక్తపరచాలంటే ఈ పదాన్ని సంస్కృతంలో ఇట్లా వాడతారన్నమాట.. బాగుంది.’ అని నుడికారాన్ని గమనించటం వల్ల భవిష్యత్తులో మంచి లాభం
జరుగుతుంది. అవి సూచించే ప్రయత్నం చేయాలని అనుకున్నా. సమయాభావం, మరియు కార్యభారం వల్ల చేయలేకపోయాను. కనుక మీరు స్వయంగా
గ్రహించటం, గుర్తించి ప్రయోగాలలో అలవాటు
చేసుకోవటం మంచిది.
8. చివరగా స్వీయపరీక్ష- (లేదా ఎవరి చేతనైనా
అడిగించుకోటం)
అ) ఏదైనా సంస్కృతపదాన్ని చదివి, తెలుగు చూడకుండా అర్థం
గుర్తు తెచ్చుకోవటం.
ఆ) ఏదైనా తెలుగుపదాన్ని చదివి, సంస్కృతం చూడకుండా
మూలపదం గుర్తు తెచ్చుకోవటం.
ఇ) అట్లాగే సంధి, సమాసం చూసుకోవటం
9. ఇంత చేసేసరికి శ్లోకంలో పదాలన్ని నోటికి వచ్చినట్టు
అవుతుంది. అప్పుడు మరో రెండు మూడు సార్లు చదివేస్తే శ్లోకం నోటికి వచ్చేస్తుంది.
10. చివ్వరగా సంస్కృతశ్లోకాన్ని చదువుతూ భావాన్ని లోపల
అనుకోవటం. ఇక్కడ ఏ పదమూ ఆటంకం కలగకపోతే ఇంక ఆ శ్లోకం మనకు అవగతమైనట్టే.
ఈ పద్ధతిని మీరిక్కడే కాదు, ఎక్కడైనా ఇతరత్రా కూడా వాడుకోవచ్చు. శ్లోకరూపంలో ఉన్నది, సానువాదం లభించిన ఏ సంస్కృతం గ్రంథాన్ని అయినా ఇట్లాగే
చదివి లాభం పొందవచ్చు.
ఇట్లా చేయటం వల్ల విషయం మొత్తం అవగతమై, సంస్కృతాన్ని మూలంనుంచే ఆనందించి, లాభం పొందుతారని ఆదరిస్తారని ఆశతో-
-మీ సంస్కృతానురాగిణి
సంకా ఉషారాణి
No comments:
Post a Comment