Friday, September 14, 2018

ఉమాసహస్రం - 1.1.5 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౫వ శ్లోకము
🌺
మూలము
అన్తర్గూఢార్థానాం పురుషాగ్నేర్ధూమకల్ప ఉద్గారః ।
శక్తిజ్వాలాః పరితః ప్రాన్తేష్వభవజ్జనో లోకః ॥౧.౧.౫॥
 
🌺
పదవిభాగం
అంతర్గూఢార్థానాం పురుషాగ్నేః ధూమకల్పః ఉద్గారః శక్తి జ్వాలాః పరితః ప్రాన్తేషు అభవత్ జనః లోకః ॥౧.౧.౫॥
 
🌺
అన్వయము
పురుషాగ్నేః ధూమకల్పః అన్తర్గూఢార్థానాం ఉద్గారః శక్తిజ్వాలాపరితః ప్రాన్తేషు జనో లోకః అభవత్ ॥౧.౧.౫॥
 
🌺
ప్రతిపదార్థము
పురుషాగ్నేః = పురుషుడను అగ్ని నుండి
ధూమకల్పః = పొగతో సమానమయిన
అన్తర్గూఢార్థానాం = పరమపురుషుని లోపల అస్పష్టమయిన పదార్థముల యొక్క
ఉద్గారః = ఆవిర్భావము
శక్తిజ్వాలాపరితః ప్రాన్తేషు = పరమపురుషుని తపోమయ శక్తిజ్వాలల చుట్టు ప్రాంతముల యందు
జనో లోకః = జనోలోకము
అభవత్ = అయినది
 
🌺
తాత్పర్యము
పరమ పురుషుడను అగ్ని నుండి వెలువడిన, పరమపురుషాంతర్గతములయిన అస్పష్టములయిన పదార్థముల ఆవిర్భావము, ఆ పరమపురుషుని తపోమయ జ్వాలల చుట్లుపట్ల ప్రాంతమందు వ్యాపించి జనో లోకమని చెప్పబడుచున్నది.
 
🌺
విశేషవివరణ
    అగ్ని నుండి వెలువడిన పొగాగ్ని జ్వాలలనంతటిని ఆవరించును. అట్లే సత్యస్వరూపుడయిన
పరమ పురుషుని నుండి వ్యక్తము కాబోవు గూఢార్థములు వెలువడి ఆయన శక్తితరంగముల చుట్టు వ్యాపించుచున్నవి. దీనికే జనోలోకమని పేరు.
    గూఢార్థములనగా- అవ్యక్తావస్థలో నుండి పుట్టిన, పుట్టుచున్న, పుట్టబోవుచున్న నానా విధ జగజ్జీవనోపాధులకు ఉపాదాన కారణములగుచు పరమ పురుషుని నుండి ఆవిష్కరించబడు పదార్థములని భావము.

No comments:

Post a Comment